నిజాంసాగర్, బతుకమ్మ : నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గల నాగమడుగు ఎత్తిపోతల పథకం కాలువలో బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన గొస్కి సందీప్(13) అదే గ్రామానికి చెందిన ఎర్రోల్ల స్వామితో కలిసి గ్రామ శివారులోని స్వామి పొలానికి వెళ్లాడు. అక్కడ సందీప్ ను ఉంచి మోటార్ స్టార్ట్ చేయడానికి స్వామి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి అక్కడ సందీప్ కనిపించలేదు. సందీప్ పొలం పక్కన ఉన్న నాగమడుగు ఎత్తి పోతల పథకం కాలువలో పడిపోయాడని స్వామి గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు వచ్చి కాలువలో వెతుకగా సందీప్ మృతదేహం లభించింది. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకందని గ్రామస్తులు తెలిపారు. మృతుని తల్లి గోష్కె బాలమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.