. . . రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
. . . మరొకరికి తీవ్ర గాయాలు
రాజేంద్రనగర్ , బతుకమ్మ :
ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తండ్రి కూలి పని చేస్తూ… అమ్మ ఇళ్లల్లో పని చేస్తూ ఉన్నదాంట్లో ఉన్నతంగా చదివిస్తున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఆ యువకుడు.. ద్విచక్రవాహనం కావాలని పట్టుబట్టాడు. వాహనం కొనిచ్చిన 24 గంటల్లోనే అదే వాహనంపై నుంచి పడి మృతి చెందాడు. ఎస్సై రాజ్‌కుమార్ వివరాల మేరకు.. హైదర్‌గూడలో నివసించే రాజు, కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అయ్యప్ప అలియాస్ ఆకాష్ (18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎంతోకాలంగా ద్విచక్రవాహనం కావాలని అడుగుతున్నాడు. చిన్న వయస్సు కావడంతో తల్లిదండ్రులు సముదాయిస్తూ వస్తున్నారు. ఈ మధ్య పట్టుబట్టడంతో గురువారం రూ.1.50 లక్షలకు వాహనం కొనుగోలు చేసి ఇచ్చారు. దానిపై తిరుగుతూ.. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడు రామ్‌చరణ్‌ను ఎక్కించుకుని వెళుతుండగా.. రాజేంద్రనగర్ చౌరస్తాలో వాహనం అదుపు తప్పి డివైడర్‌పై పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామ్‌చరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి.