Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 6:48 pm Posted by : ramakrishna

తాడ్వాయి లో గ్రామ దేవతలకు బోనాలు

 

తాడ్వాయి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లోని కన్కల్, తాడ్వాయి, కృష్ణాజివాడి గ్రామాలలో గ్రామ దేవతలకు ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ బోనాల పండుగను గ్రామస్తులు ప్రతి ఏటా ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో గ్రామస్తులంతా ఏకమై అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పండగ రోజు మహిళలు కొత్త కుండలతో అన్నం, పాలు, బెల్లంతో బోనాలన్నీ వండి పసుపు, కుంకుమ, వేప ఆకులతో అలంకరించి, తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, గాజులు సమర్పించి గ్రామ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తారు. డప్పు వాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివ సత్తుల డాన్స్ లతో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామంలో కోరిన కోరికలు తీర్చే దేవతలు నల్ల పోచమ్మ, నాయకమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ, అమ్మవార్లకు గ్రామస్తులు ఈ బోనాలను సమర్పిస్తారు. పాడిపంట, గొడ్డుగోదా, పిల్లపాపలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు మంచిగా కురవాలని గ్రామస్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.