Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 4:40 pm Posted by : ramakrishna

బోనాల ఫ్లెక్సీ వివాదం

 

. . . కార్పొరేటర్‌పై బెదిరింపుల ఆరోపణలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీ తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. హమాల్వాడి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నెరమటి రాజు స్థానిక 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెరమటి రాజు తెలిపిన వివరాల ప్రకారం, బోనాల పండుగ సందర్భంగా హమాల్వాడి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడి హోదాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయమై కార్పొరేటర్ ఎర్రం సుధీర్ ఫోన్ చేసి, తన అనుమతి లేకుండా డివిజన్‌లో ఫ్లెక్సీ ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తూ, స్వచ్ఛందంగా తొలగిస్తారా లేదా తామే చింపివేయాలా అంటూ బెదిరించినట్లు ఆరోపించారు. అదే రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో కార్పొరేటర్ అనుచరులు ఫ్లెక్సీని చించివేసినట్లు రాజు పేర్కొన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, అప్పట్లో ఫ్లెక్సీ ఫ్రేమ్‌ను కార్పొరేటర్ ఇంటి వద్దకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఫ్లెక్సీ తొలగించిన వారిని ప్రశ్నించగా, కార్పొరేటర్ ఆదేశాల మేరకే తొలగించినట్లు చెప్పారని తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, అక్కడ కూడా రాజీ పడాలని ఒత్తిడి తెచ్చారని, రాత్రి వేళల్లో రోడ్డుపై ఎలా తిరుగుతావంటూ కార్పొరేటర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజు ఆరోపించారు. తనకు కార్పొరేటర్ వల్ల ప్రాణహాని ఉందని, భవిష్యత్తులో తనకు ఏదైనా జరిగితే అందుకు ఎర్రం సుధీర్ బాధ్యత వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారుల జోక్యంతో నిష్పక్షపాత విచారణ జరిపి, తనకు న్యాయం చేయాలని నెరమటి రాజు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు.