Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:21 pm Posted by : ramakrishna

ఆర్కిడ్స్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఆర్కిడ్స్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ స్ఫూర్తిని చిన్నారుల్లో పెంపొందించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం పండుగ వేడుకలను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ గోపి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. పాఠశాల ప్రాంగణాన్ని మల్లెపూల దండలు, వేపాకులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. విద్యార్థినులు రంగురంగుల చీరల్లో బోనం కుండలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా పోతరాజు వేషధారణలో ఇద్దరు విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. వారి శరీరానికి పసుపు రాసి, మెడలో దండలు ధరించి బోనాల సాంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రిన్సిపల్ గోపి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరానికి అందించాల్సిన బాధ్యత పాఠశాలలపై ఉంది. బోనాల వంటి జానపద పండుగలు ఐక్యతకు, సామరస్యానికి చిహ్నాలు. విద్యతో పాటు విలువలను కూడా పిల్లలకు నేర్పించాలని అన్నారు. కార్యక్రమం చివరలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అందరికీ ప్రసాదాలు పంచారు. విద్యార్థులు పాటలు, డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు.