Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 June 2025, 5:41 pm Posted by : ramakrishna

ఘనంగా బోనాల పండుగ

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు, ముదిరాజ్ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. తెలుగు సంప్రదాయ సంస్కృతుల పరంపరను ప్రతిబింబించేలా, ఈ పండుగ గ్రామీణ జీవనశైలిలోని ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఉత్సవంలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకొని, శోభాయమానమైన బోనాలతో తమ నివాసాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి డప్పు వాయిద్యాల మధ్య మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ, “ఈ బోనాల పండుగ ప్రతి ఏడూ జేష్ట, ఆషాడ మాస, ఆరీద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించబడుతుంది. ఇది మా పూర్వీకుల నుండి సంక్రమించిన సంప్రదాయం. రైతులకు పంటలు బాగా పండాలని, పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పెద్దకాపు సాయిలు, ఉద్మిర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రి, లింగు గణేష్, లింగ సుదర్శన్, శ్రీరామ్, సాయిలు, అనిల్, భూమయ్య, సతీష్, సూరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం తరఫున జంపాడి మక్కయ్య, జంపల్లి పోశెట్టి, గంగాధర్, చిన్న మక్కయ్య, కాకయ్య పాల్గొన్నారు. అలాగే రజక కుల సంఘ నాయకులు నారాయణ, ప్రసాద్, తదితర కుల సంఘాల పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై పండుగ వేడుకలకు సౌందర్యాన్ని చేకూర్చారు. ఈ కార్యక్రమం భక్తి, భరోసాతో పాటు సాంఘిక సమరసతను ప్రతిబింబించగా, తరాల తరాలకు సాంస్కృతిక విలువలను అందించాలనే సంకల్పంతో విజయవంతంగా ముగిసింది.

Bonala festival in full swing