- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. పండగకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బోనం ఎత్తి మహిళల వెంట కొద్ది దూరం నడిచారు. అనంతరం పోచమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అంతకుముందు జర్నలిస్ట్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చందు,ఉప అధ్యక్షులు శ్యాం సుందర్, సీనియర్ జర్నలిస్టులు మల్లికార్జున స్వామి, రాజేశ్వర్ రెడ్డి, మోయిన్, ప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
