భీమ్ గల్, బతుకమ్మ : ఆషాడ మాస ఏకాదశిని పురస్కరించుకొని పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు బోనాలు సంబరాలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల నుండి విద్యార్థులు,ఉపాధ్యాయ బృందంతో ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పాటలు నృత్యాలు, కోలాట నృత్యాలతో సందడి చేశారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారి వేషధారణ, పోతరాజుల వేషధారణ, పోతారాజుల నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు. బస్టాండ్ మీదుగా ఉరిపొలిమేరలో గల పోచమ్మ మందిరం వద్దకు చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర భాష, వేషధారణ, కళలు ,సంస్కృతి- సాంప్రదాయాలు, ఆచారాలు విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ బోనాలు పండగను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.గత ఎనిమిది సంవత్సరాల నుండి ఆషాడ మాసం లొ బోనాల పండుగను జరుపుతున్నమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయురాల్లు బోనాలు ఎత్తడం విశేషం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రాసా రవికుమార్, అడ్మినిస్టటివ్ అధికారి నర్సారెడ్డి అకాడమీక్ ఇంచార్జ్ సాయిచరణ్ పాల్గొన్నారు.
