కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామ శివారులోని మొగుళ్ల సాయ గౌడ్ కు చెందిన పొలంలో బాంబు పేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం , పొగ రావడంతో చుట్టుపక్కలున్న రైతులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు వేసి వెళ్లారని రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. బాంబుల భయంతో కూలీ పనివారు ఎవరు కూడా పనికి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేసే సీజన్ అవడంతో పంట దిగుబడి పై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. కాగా ఈబాంబు పేలుళ్లపై మొగుళ్ల సాయ గౌడ్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఈనెల 27న ఫిర్యాదు చేశారు. తొందరగా విచారించి , నిందితుల్ని పట్టుకొని ,కఠినంగా శిక్షించాలని కోరారు.
