బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మాతో శుక్రవారం సందర్శించారు. అందులో జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ , డిప్యూటీ డీఎంహెచ్ఓ , వైద్యాధికారుల బృందం పాల్గొని శిబిరానికి మరింత ప్రాధాన్యత కల్పించారు.
సబ్ కలెక్టర్ సూచనలు….
శిబిరం సందర్శన సందర్భంగా సబ్ కలెక్టర్ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) ఉచితంగా అందుతున్న పరీక్షలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా, ప్రతి మూడు నెలలకొకసారి స్వయం సహాయక సమూహాల (SHGs) సభ్యులు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆరోగ్య మహిళ క్లినిక్స్ పై అవగాహన….
ప్రతి మంగళవారం రోజున రుద్రూర్ పీహెచ్ సీ, రాకాసీపేట్ యూపీ హెచ్సీ లో గల ‘ఆరోగ్య మహిళ’ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు మహతో తెలిపారు. వీటిలో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కల మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు, సేవలు అందించబడుతాయని వివరించారు.
డిప్యూటీ డీఎంహెచ్ వో సూచనలు
ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ వో మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజూ ఎన్ సీడీస్ ( నాన్ కమ్యూనికేబుల్ డీసీజేస్) స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు ఈ స్క్రీనింగ్ సేవలను నిరంతరంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన వైద్య చికిత్స పొందవచ్చని ఆమె సూచించారు.
