Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 5:27 pm Posted by : ramakrishna

పంట నష్టం పరిశీలించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

  • వరి, సోయా పంటలు నీటమునిగి రైతుల నష్టంపై ఆవేదన

 

బతుకమ్మ బోధన్ : బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో కురిసిన భారీ వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహించడంతో ఖాజాపూర్, హుంసా, మందర్న  గ్రామాల పరిసరాల్లో వేల ఎకరాల్లో వరి, సోయా పంటలు మునిగిపోయి నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రభావిత గ్రామాలను సందర్శించి, పంట పొలాలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ – “కొన్ని గంటల్లోనే మంజీర నది ఉగ్రరూపం దాల్చి, పంటలన్నీ ముంచెత్తింది. వరి, సోయా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను” అని అన్నారు. అధికారులు ఇప్పటికే పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. “త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి, రైతులకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. నివేదిక అందిన వెంటనే సాయాన్ని విడుదల చేస్తాం” అని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ – “మా శ్రమ అంతా వృథా అయింది. తక్షణమే నష్టపరిహారం అందకపోతే అప్పుల బారిన పడతాం” అని వేదన వ్యక్తం చేశారు. ఈ సందర్శనలో ఎమ్మెల్యేకు స్థానిక అధికారులు, పార్టీ నాయకులు తోడయ్యారు. పంట పొలాల్లో నష్టాన్ని చూసి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Bodhan MLA Sudarshan Reddy inspects crop damage