Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 April 2025, 2:46 pm Posted by : ramakrishna

దూసుకెళ్తున్న నల్లమట్టి టిప్పర్లు

. ప్రమాదకరంగా రాకపోకలు
. పట్టించుకోని అధికారులు
నందిపేట్, బతుకమ్మ: ఒకటి కాదు.. రెండు కాదు వందలాది భారీ వాహనాలు నల్ల మట్టి ఓవర్ లోడ్ తో దూసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద గోదావరి లో నుంచి నల్లమట్టిని నందిపేట మండలం మీదుగా జోరుగా తరలిస్తున్నారు. భారీ టిప్పర్లు ఒకదాని వెనుక మరోటి ప్రమాదకరంగా దూసుకెళ్తున్నాయి.

ఆ టిప్పర్ల వెనుకా ముందు ప్రయాణించే వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. పంట పొలాలకు తరలించాల్సిన సహజవనరైన నల్లమట్టి వ్యాపారానికి ఉపయోగపడుతోంది. తూతూ మంత్రంగా పర్మిషన్లు పొందుతున్న నల్ల మట్టి వ్యాపారులు దళారులను నియమించుకుని దందాను జోరుగా సాగిస్తున్నారు. భారీ లోడ్ తో దూసుకెళ్తున్న టిప్పర్లలో నుంచి నల్లమట్టి ముద్దలు రోడ్లపై పడిపోతుండడంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.

ఇటీవల నందిపేట మండలం బజార్ కొత్తూర్ గ్రామానికి చెందిన రైతు కొండూర్ కు వెళ్తుండగా ముందు వెళ్తున్న టిప్పర్ లో నుంచి నల్లమట్టి రోడ్డుపై పడడగా సదరు రైతు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇలా రోడ్లపై పెద్ద పెద్ద నల్లమట్టి ముద్దలు పడిపోతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉన్నా అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నందిపేట మండల వాసులతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులు నందిపేట రోడ్లంటేనే జంకుతున్నారు.

Black soil tippers rushing by