Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 August 2025, 3:38 pm Posted by : ramakrishna

స్థానికంపై బీజేపీ మాస్టర్ ప్లాన్              

  • ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వాళ్లు.. స్ధానిక బరిలో దిగాల్సిందే
  • బీజేపీలో సరికొత్త డిమాండ్
  • అధిష్ఠానం నిర్ణయంతో.. కింకర్తవ్యం అంటున్న నేతలు
  • నాకు వద్దు బాబాయ్ అంటూ తలలు పట్టుకుంటున్న నేతలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాషాయ పార్టీ సిద్దమవుతోంది. మెజార్టీ జడ్పీ పీఠాలపై కన్నేసిన కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్ధులను స్ధానిక బరిలో నిలవాలని సూచిస్తోంది. ఈ పాటికే కొందరు అభ్యర్ధులకు అభిప్రాయం కోరగా.. ఆ ఒక్కటి అడగొద్దని తప్పించుకుంటున్నారు సదరు నేతలు..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాషాయ పార్టీ బలంగా ఉంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ త్వరలో జరిగబోయే స్దానిక  సంస్ధల ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంది. అత్యధిక గ్రామ పంచాయతీలతో పాటు ఉమ్మడి జిల్లాలోని రెండు జడ్పీ పీఠాల కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఉవ్విళూరుతోంది. ఈ మేరకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది.  తాజాగా ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్ధులను జడ్పీటీసీలుగా పోటీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే అభ్యర్ధులు.. కాబోయే జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధులుగా ఉంటారని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ అభ్యర్దిగా బరిలో నిలిచిన దినేష్ కులాచారిని జడ్పీటీసీ బరిలో ఉండాలని పార్టీ నేతలు సూచించారు. బరిలో నిలిస్తే.. ఛైర్మన్ చేసే బాధ్యత తమదేనని చెప్పుకొచ్చారు. అధిష్టాన నిర్ణయానికి ఆయన సున్నితంగా తిరస్కరించారట. నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఉన్నాడంటూ.. ఓ మాజీ జడ్పీటీసీ పేరును ప్రతిపాదించారు దినేష్. ఇక బోధన్ లో పోటీ చేసిన రైస్ మిల్లర్ల నేత మోహన్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జీగా ఉన్న మల్లికార్జున్ రెడ్డి సైతం పోటీకి నిరాకరించారని సమాచారం. కానీ అధిష్టానం మాత్రం రెండు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలపై కాషాయ జెండా ఎగురవేయాలని స్కెచ్ వేస్తోంది.

స్దానిక సంస్ధల ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే విధంగా కాషాయ పార్టీ కార్యచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగానే.. ఎమ్మెల్యే లుగా పోటీ చేసి ఓటమి పాలైన నేతలను బరిలో నిలబెట్టాలని కోరుతోంది. అధిష్టాన నిర్ణయాన్ని కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు తమ ప్రాంతాల్లో జడ్పీటీసీగా పోటీ చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపాలని కోరుతున్నారు. ఈ మేరకు స్టేటస్ పెట్టి మరీ తమ ఆకాంక్ష చాటిచెబుతున్నారు. ఐతే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నేతలు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతుంటే.. పార్టీ నేతలు తాజా నిర్ణయం మింగుడు పడటం లేదు. జడ్పీటీసీగా పోటీ చేయలేమని తెగేసి చెబుతున్నారు. బలమైన అభ్యర్ధులను వెతికే పనిలో పడ్డారు సదరు నేతలు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్దులు స్దానిక ఎన్నికల్లో పోటీ చేయాలనే అంశం ఇందూరు కాషాయ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బోదన్ నియోజకవర్గంకు చెందిన ఒక నాయకుడు జడ్పి ఎన్నికల బరిలో నిలిచేందుకు అసక్తి చూపుతున్నట్లు సమాచారం. తన గెలుపుతో పాటు ఇతర జడ్పిటిసీలను గెలిపించే బాధ్యత అప్పగించారని అప్పుడే జడ్పీ పీఠం కైవసం చేసుకోవచ్చని కమలనాథులు ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిసింది.

స్దానిక సంస్ధల ఎన్నికలకు కాషాయ పార్టీ క్యాడర్ ను సిద్దం చేస్తోంది. వరుస సమావేశాలతో కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్ధులు పోటీ చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే.. బీజేపీ కొత్త నినాదం చాలా మంది నేతలకు  మింగుడు పడటం లేదు అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో జడ్పి పీఠం అలంకరించిన వారికి చరిష్మ ఉన్న నేతలుగా చలమాణి అయ్యారు. మొదటి జడ్పీ చైర్మెన్ చౌట్ పల్లి హన్మంత్ రెడ్డి,  మాజీ మంత్రి శనిగారం సంతోష్ రెడ్డి, కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేంకట రమణా రెడ్డి, ప్రస్తుత ఉర్ధు అకాడమీ చైర్మెన్ తాహేర్ బిన్ హందాన్ లాంటి వారు  అందుకు ఉదహరణగా చెప్పాలి. జిల్లా పరిషత్ పీఠం దక్కిన వారికి జిల్లాలో క్యాబినేట్ హోదా తో పాటు మంది మార్బలం, కార్యాలయం అధికారులు ఉండటంతో ఆ పీఠంకు పోటీ ఎక్కువనే చర్చ ఉంది. కామారెడ్డి జిల్లాలో బిజేపి మాస్టర్ ప్లాన్ అమలుపై కమలం పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.