Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 9:05 pm Posted by : ramakrishna

వక్ఫ్ బిల్లుపై బీజేపీ అబద్ధ ప్రచారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ అబద్ధ ప్రచారం చేస్తూ,  ప్రజల దృష్టిని మత విద్వేషాల వైపు మళ్లించేందుకు కుట్రలు చేస్తోందని  ఆల్ ఇండియా  ఖౌమీ తన్జీం నిజామాబాద్ జోన్ అధ్యక్షుడు, మాజీ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగ చైర్మన్ సుమీర్ అహ్మద్ విమర్శించారు. వక్ఫ్ బిల్లు పేద ముస్లింల మేలుకోసమేనంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్‌లను ఉద్దేశించి – “మీకు నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే , అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సబ్బీర్ అలీ కృషితో అమలైన 4% రిజర్వేషన్‌ను మరింత పెంచేలా బీసీ ముస్లింలకు ప్రత్యేక బిల్లు తీసుకురావాలని సూటిగా డిమాండ్ చేశారు. ఒకవైపు బీసీ ముస్లింలకు మద్దతు ఇచ్చినట్టుగా మాటలు చెబుతూ, మరోవైపు ఆ రిజర్వేషన్లను మతపరమైనవిగా పేర్కొంటూ రద్దు చేయాలని డిమాండ్ చేయడం బీజేపీ ద్వంద్వ ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.  వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వానికి చెందవని, ఇవి మా తాత ముత్తాతలు పేద ముస్లింల మేలుకోసం, అల్లాహ్ ఖుషీకోసం చేసిన దానమని స్పష్టం చేశారు. ఈ ఆస్తులపై పర్యవేక్షణ ఉండవచ్చుగానీ, అధిపత్యం కలిగి ఉండటం తప్పని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కేంద్ర ప్రభుత్వం బ్రోకర్లుగా మారి వక్ఫ్ ఆస్తులను కట్టబెట్టే చర్యలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల బీజేపీ పాలనలో దేశ అభివృద్ధికన్నా హింసాత్మక ఘటనలే ఎక్కువగా జరిగాయని విమర్శించారు. గో మాంసం, హిందూ-ముస్లిం గొడవలు లాంటి మత వివాదాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మతపరమైన రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను, బీసీలను, దళితులను బలిపశువులుగా మారుస్తున్న బీజేపీ కుట్రలను దేశంలోని హిందూ, ముస్లిం, బీసీ, దళిత వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించి తిప్పికొడతాయని స్పష్టం చేశారు.