. . . బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షుడు దినేష్ తీవ్రంగా స్పందిస్తూ, ఎమ్మెల్యే ఇంటి వద్దకు కాంగ్రెస్ నాయకులు వస్తే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. ఆర్మూర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించడం సమంజసం కాదని అన్నారు. అలాగే, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని దినేష్ పేర్కొన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులు, 92 గ్రామాలకు సుమారు 3,000 ఇళ్ల మంజూరు, ఆర్మూర్ మున్సిపాలిటీకి రూ.45 కోట్లతో ఆధునిక సాంకేతిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద రూ.43 కోట్ల నిధుల సమీకరణ, డొంకేశ్వర్ మండలంలో ఎమ్మార్వో కార్యాలయ భవనం మంజూరు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. అదే విధంగా, గల్ఫ్ కార్మికుల సమస్యలను తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించి, మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందేలా కృషి చేశారని దినేష్ పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా సుమారు రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆర్మూర్ ప్రజలకు తీసుకొచ్చారని ఆయన అన్నారు. రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం జరిగితే, కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసాలను కూడా ముట్టడిస్తామని దినేష్ హెచ్చరించారు. రేపు చోటుచేసుకునే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, ప్రధాన కార్యదర్శి పోతంగర్ లక్ష్మీనారాయణ, నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదాల నరేష్, జ్యోతి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓంసింగ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
