Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 7:28 pm Posted by : ramakrishna

బోధన్‌లో భాజపా విజేతలకు ఘన సన్మానం

 

బోధన్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి చెందిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఘనంగా సన్మానించారు. బోధన్‌లోని ఎంఎపిఆర్  కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.స్థానిక పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులుగా గెలుపొందిన భాజపా అభ్యర్థులను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, అధికార పార్టీ నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురైనా భాజపా అభ్యర్థులు ధైర్యంగా పోరాడి ప్రజల మద్దతుతో విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక ఎన్నికల్లో భాజపా శ్రేణులు తమ సత్తా చాటాయని, ఈ విజయాలు బోధన్ నియోజకవర్గంలో పార్టీ బలాన్ని మరింత పెంచాయని తెలిపారు.రాబోయే రోజుల్లో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా భాజపా అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని, బోధన్ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు నిరుత్సాహ పడవద్దని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. గెలుపొందిన ప్రతీ అభ్యర్థి తమ గ్రామాల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు నిస్వార్థ సేవ అందించాలని హితవు పలికారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు భాజపా తరఫున అందిస్తామని మేడపాటి ప్రకాష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

BJP winners felicitated in Bodhan