. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29న సడలించాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లైందని ప్రజలు భావిస్తున్నారని, పింఛన్లు పెంచడం దేవుడెరుగు ఉన్న పింఛన్లను ఎత్తేస్తున్నారని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లేసి గట్టుమీద పెట్టేశారని విమర్శించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు సెటిల్మెంట్ లు చేసే పరిస్థితి లేదన్నారు. రైతులను ఆగం చేశారని, ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించే స్థితిలో రేవంత్ ప్రభుత్వం లేదన్నారు. మూసీ బాధితుల పక్షాన నిలుస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన
బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఈటెల రాజేందర్ అన్నారు. భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.