Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:03 pm Posted by : ramakrishna

బీజేపీ అంటే బ్రిటీష్ జాహిల్ పార్టీ

 

. . . సీసీ కెమెరాలు ఆపేసి.. ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థులపై పైశాచికానికి తెగబడ్డారు

 

. . . నాటి బ్రిటీష్ ప్రభుత్వం దాష్టీకాలనే నేడు బీజేపీ చేస్తోంది

 

. . . తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న  విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. బుధవారం ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. పరీక్షలు ఫెయిర్ గా నిర్వహించాలని నిరసన తెలిపితే సీసీ కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థుల వీపులపై లాఠీలు ఝళిపించారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం మనపై ఏ విధంగా దాష్టీకాలకు పాల్పడిందో ఇప్పుడు బీజేపీ కూడా సొంత ప్రజలపై అదే విధంగా దాష్టీకాలు చేస్తుందన్నారు. విద్యార్థులపై పాశవికంగా చేసిన దాడికి బీజేపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు. వలస పాలనలో బ్రిటీష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంత మూర్ఖంగా దాడులు చేశారో ఇప్పుడు బీజేపీ అంతే మూర్ఖంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో రైతులపై ఇప్పుడు విద్యార్థులపై పైశాచికంగా చేసిన దాడులను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. సీసీటీవీ కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థులపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేశారని అన్నారు. విద్యార్థినులను రోడ్డుపై పరుగెత్తించుకుంటూ రక్తాలు వచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో 90 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఒక విద్యార్థిని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆనాడు బ్రిటీష్ వాళ్లు కూడా మన స్వేచ్ఛ ను హరించి, ప్రశ్నిస్తే దాడులు చేశారని, ఆనాటి పాలనను బీజేపీ గుర్తు తెస్తుందని కవిత మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించటం పౌరులకు ఉన్న హక్కు అని  గుర్తు చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేని ఈ బీజేపీకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్రపంచం ముందు భారత్ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని కవిత అన్నారు. విద్యార్థులపై క్రూరంగా వ్యవహరించినందుకు దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

. . . లాఠీ దెబ్బలకు, రక్తం చుక్కలకు సమాధానం తప్పదు

నీట్ ఎగ్జామ్ నిర్వహించడం చేతకాని కేంద్రం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జులుం ప్రదర్శించడం ఏమిటని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని  చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల దాడిని చూసి దేశం మొత్తం నిశ్చేష్టులయ్యారని  అన్నారు. పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత ఎవరిది? విద్యార్థుల చావులకు ఎవరు సమాధానం చెబుతారని  ప్రశ్నించారు. విద్యార్థులు చిందించిన ప్రతి రక్తం బొట్టుకు, వారిపై విరిగిన లాఠీలకు దేశం మొత్తం కచ్చితంగా ఓటు రూపంలో జవాబు చెబుతుందని హెచ్చరించారు. పేపర్ లీక్ చేసిన వాళ్లను గుర్తించి వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ మాత్రం పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు చెప్పాలన్నారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా సామరస్యంగా ఉండాలన్నారు. ఈ సిస్టమ్ మార్చేందుకు విద్యార్థుల తరఫున రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయన్నారు.

. . . గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు అండగా ఉండాలి

స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారి ఆదాయం కుటుంబ పోషణకు కూడా  సరిపోవడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. అగ్రిగేటర్స్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షం ఉండాలని కోరారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందన్నారు.