. . .గాంధీ చౌక్ నుంచి ఆర్‌ఆర్ చౌరస్తా వరకు మహా పాదయాత్ర
. . . జాతీయ అధ్యక్షుడి రెండో ప్రసంగం కు వేదిక కానున్న ఇందూర్
నిజామాబాద్, బతుకమ్మ:
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న నిజామాబాద్ నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో నిర్వహించనున్న మహా పాదయాత్ర లో ఆయన పాల్గొననున్నారు. గాంధీ చౌక్ నుంచి ఆర్‌ఆర్ చౌరస్తా వరకు ఈ పాదయాత్ర కొనసాగనుండగా, అనంతరం ఆర్‌ఆర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నితిన్ నబీన్ ప్రసంగించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.జాతీయ అధ్యక్షుడి పర్యటనను పురస్కరించుకుని కార్యక్రమ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నాయకులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా పాదయాత్ర నిర్వహణ, సభా ప్రాంగణం ఏర్పాటు, నాయకులు, కార్యకర్తల సమన్వయం, జన సమీకరణ తదితర అంశాలపై నాయకులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ, కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో బీజేపీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. జాతీయ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో నితిన్ నబిన్ హైదరబాద్ లో పర్యటించారు. అతరువాత తెలంగాణలో మళ్లీ జాతీయ అధ్యక్షుడితో పార్టీ శ్రేణుల సమావేశాలు జరుగలేదు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడి ఇందూర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి అధినేత పర్యటన అనంతరం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. తెలంగాణలో పాగా వేసేందుకు బిజేపి విశ్వ ప్రయత్నం చేస్తుండగా అపార్టి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి భవిష్యత్తు లో అనుసరించాల్సిన వ్యూహాలు కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ చీఫ్ పర్యటనను ఇందూర్ లో పెట్టేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి పట్టు బట్టి రప్పిస్తున్నారనే టాక్ ఉంది.
