. . . అధికారులు పనులను పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి
బాన్సువాడ, బతుకమ్మ :
పట్టణంలోని కల్కి చెరువు కట్టకు ఏర్పడిన బుంగ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాసిరకం పనుల ఫలితమేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల బొగుడ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం చెరువు తూము వద్ద ఏర్పడిన బుంగ ప్రాంతాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు పునరుద్ధరణ, కట్ట ఆధునికీకరణ పేరుతో గత ప్రభుత్వంలో సుమారు రూ.6 కోట్ల నిధులతో చేసినప్పటికీ, నాణ్యతలేని పనుల వల్ల కట్ట దెబ్బతిందని, గతంలో కూడా కట్ట కుంగిపోయిందన్నారు. ప్రస్తుతం బుంగ పూడ్చివేతకు రూ.27 లక్షలతో పనులు చేపడుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోణాల గంగ రెడ్డి, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తుప్తి శివప్రసాద్, నాయకులు చీకట్ల రాజు, ముత్యాల సాయిబాబా, కొండని గంగారం, శంకర్, మహేందర్, ప్రదీప్, సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.