రుద్రూర్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ గెలుపు పై రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద గురువారం మండల బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి, సీట్లు పంచుతూ ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్రూర్ మండల బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజి రెడ్డి విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, ఎమ్మెల్సీల ఎన్నికల్లో బిజెపి పార్టీకి మద్దతు తెలిపిన అభ్యర్థులే ఈ విజయానికి కారణమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బిజెపికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో సైతం బిజెపి పార్టీ విజయం సాధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి ఒక్క బిజెపితోనే సాధ్యమని, ఈ పార్టీ అందరికీ రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు. గత 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమిటి లేదని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని, గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆధిపత్య పోరు కోసం పాటుపడుతోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ ప్రశాంత్ గౌడ్, మండల సీనియర్ నాయకులు తోట శంకర్, రాంరాజు, మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, రేపల్లి సాయిప్రసాద్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, సతీష్ పవర్, శ్రీనివాస్, పోతురాజు శ్రీనివాస్, గంగాధర్, రాజేష్, రజినీకాంత్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
