Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 6:26 pm Posted by : ramakrishna

గాంధీ పేరును రూపుమాపాలనే బీజేపీ కుట్ర చేస్తుంది

 

. . . మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకల్లో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలనే బీజేపీ కుట్ర చేస్తుందని డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆరోపించారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ కీలకపాత్ర పోషించారని, శాంతి, అహింస అనే మార్గం తో బ్రిటిష్ వారిని గడగడలడించిన వ్యక్తి అని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 లో కొందరు దుష్టశక్తులు గాంధీని హత్య చేయడం జరిగిందని, మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తి గాంధీ అని అన్నారు. 2004లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో పర్యటించినప్పుడు చాలామంది వలసలు వెళుతున్నారని వలసలను ఆపడానికి వంద రోజులు ఉపాధి హామీ పనిని ప్రారంభించడం జరిగిందని, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీనికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టారని 100 రోజుల పనిని సంవత్సరంలో ఎప్పుడైనా గ్రామ సభలో సర్పంచ్ సమక్షంలో గ్రామ ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛను అందించడం జరిగిందని, ప్రస్తుతం బిజెపి గాంధీ పేరు వింటేనే భయపడుతూ గాంధీ పేరూను మార్చాలనే కుట్రతో ఉపాధి హామీ పని పేరును మారుస్తూ జీ రామ్ జీ అని పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్తున్నారని అందులో 70 రోజులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని మిగతా 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని బీజేపీ చెప్తుందని, దీనివల్ల అన్ని రాష్ట్రాలపై అధిక భారం పడుతుందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పని 100 రోజుల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించిందని నగేష్ రెడ్డి తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా మళ్లీ ఉపాధి హామీ పనిని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఘన్ రాజ్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, డిచ్ పల్లి సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వాసు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, నగర మైనారిటీ అధ్యక్షులు ఎజాస్, మార్కెట్ కమిటీ సభ్యులు ఈసా, స్వప్న, బంటు బలరాం, సలీం, నూర్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.