. జీజీహెచ్ చుట్టూ వివాదాలు
. అయినా మారని పరిస్థితి
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఆమె ఫిర్యాదులు, ఆరోపణలు అనేకం ఉండడంతో తీరు మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇంత జరిగినా పరిస్థితిలో మార్పు రావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ బిద్యానాయక్ ఫిట్స్ వచ్చిన తన భార్యను చికిత్స నిమిత్తం శుక్రవారం జీజీహెచ్ కు తీసుకువచ్చాడు. సదరు మహిళ చికిత్సకు సహకరించకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. స్కానింగ్ చేయించాలని బిద్యానాయక్ కు సూచించగా, ఆయన జీజీహెచ్ లో చేయాలని కోరాడు. జీజీహెచ్ లో స్కానింగ్ లేదని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకురావాలని సూచించారు. దీంతో బిద్యానాయక్ రాత్రి వరకు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పర్సనల్ అసిస్టెంట్ గణపతితోపాటు బీజేపీ నాయకులు జీజీహెచ్ కు చేరుకుని వైద్యులను నిలదీయంతో వైద్యం అందించారు. కనీసం స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో బిద్యానాయక్ తన భార్యను భుజాలపై వేసుకుని జీజీహెచ్ లోని అంతస్తులన్నీ తిరుగుతూనే ఉండిపోయాడు. శుక్రవారం నాటి ఈ ఘటన జీజీహెచ్ లోని పరిస్థితికి అద్దం పట్టింది.
ఇంత జరిగినా శనివారం ఉదయమే సూపరింటెండెంట్ బర్త్ డే వేడుకల కోసం ఆమె చాంబర్ ను ఫంక్షన్ హాలును మరిపించేలా డెకొరేట్ చేశారు. ప్రతిమారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీజీహెచ్ లోని వైద్యులతోపాటు సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు. వార్డుల్లో వైద్యులు, సిబ్బంది లేక రోగులు అవస్థలు పడుతుంటే వారి సహాయకులు తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. చాంబర్ లో సూపరింటెండెంట్ బర్త్ డే వేడుకలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీజీహెచ్ లో పరిస్థితులు ఎప్పుడు మారుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

