Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 10:35 pm Posted by : ramakrishna

కేటీఆర్‌కు బిగ్ షాక్..

  • ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ1గా చేర్చిన ఏసీబీ
  • ప్రభుత్వానికి నివేదిక

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహితమైన ఫార్ములా ఈ-కార్ రేస్‌లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దాదాపు 9 నెలలుగా విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు తమ పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిపై చార్జ్‌ షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం నివేదికను ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, అలాగే ఏ4, ఏ5 నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సన్నాహాలు చేస్తోంది.

గవర్నర్ నుంచి అనుమతి లభించిన వెంటనే ఈ చార్జ్‌షీట్ దాఖలు కానుంది. ఈ కేసులో రూ.55 కోట్ల నిధులు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి బదిలీ చేయబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ నిధులను మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో కేటీఆర్‌ను రెండుసార్లు, అరవింద్ కుమార్‌ను మూడుసార్లు ఏసీబీ విచారించింది. అదేవిధంగా, ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కూడా మనీలాండరింగ్ కోణంలో విచారిస్తోంది. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.