. . . రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, మోటార్‌సైకిల్ స్వాధీనం
. . . ముగ్గురు నిందితులపై కేసు నమోదు
బిచ్కుంద, బతుకమ్మ :
జూదం కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా బిచ్కుంద పోలీసులు పుల్కల్ గ్రామంలో పేకాట స్థావరంపై శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, పుల్కల్ గ్రామంలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేపట్టారు. ఘటనాస్థలంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.4,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తుల జీవితాలను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయడమే కాకుండా కుటుంబాల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సూచనల మేరకు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ మార్గాలను ఎంచుకోవద్దని, కష్టపడి సంపాదించి కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. జూదం, బెట్టింగ్ లేదా ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ – 100కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.