Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 8:16 pm Posted by : ramakrishna

ప్రమాదకరంగా మారిన బీబీపేట్ రోడ్డు వంతెన

 

. . . కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

బీబీపేట్ మండల కేంద్రంలోని రోడ్డు వంతెన ప్రమాదకరంగా మారడంతో వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత వర్షాకాలంలో కూలిపోయిన ఈ వంతెనకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు, ముద్రాజ్ కొరివి నరసింహులు మాట్లాడుతూ.. వంతెన పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యలను రాజకీయ కోణంలో చూడకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి. ప్రతి విషయాన్ని రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి” అని వారు పేర్కొన్నారు. బీబీపేట్ నాలుగు జిల్లాలకు కూడలిగా ఉందని, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల ప్రజలు ఈ మార్గం ద్వారా నిత్యం ప్రయాణిస్తారని తెలిపారు. ఇలాంటి కీలకమైన రహదారిపై ఉన్న వంతెనను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. వంతెన నిర్మాణంపై అధికారులు, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందని గ్రామస్తులు హెచ్చరించారు. ఎన్నికల వరకు వేచి చూసే పరిస్థితి కాకుండా వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని బీబీపేట్ గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.