Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 3:26 pm Posted by : ramakrishna

భూ వివాదాల పరిష్కారానికి ‘భూ భారతి’ దోహదం

అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్ లో భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని, భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సాదా బైనామాల క్రమబద్దీకరణకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ధరణి వల్ల పరిష్కారం కాని అనేక భూ సంబంధిత సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం జరిగేలా ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. ధరణి అమలైన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ నిలిచిపోయిందని, తిరిగి ప్రస్తుతం భూభారతి తో మళ్లీ రికార్డుల నిర్వహణ జరుగుతుందని వివరించారు. మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ లలో అధికారులు ఎవరైనా కావాలని తప్పిదాలకు పాల్పడితే, అలాంటి వారిపై కేసులు నమోదు చేసేలా భూభారతి చట్టంలో నిబంధనలు పొందుపర్చారని, తద్వారా పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కల్యా లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పోతంగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సదస్సులో భూభారతి చట్టంపై రైతులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

'Bhu Bharati' contributes to resolving land disputes