Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 12:32 am Posted by : ramakrishna

భవతీ.. క్షీరాందేహీ

  • రోజురోజుకి తగ్గుముఖం
  • రైతుల కలిసేందుకు బిడియం
  • చైర్మెన్ రాకలో ఆరు వేలు,
  • ప్రస్తుతం నాలుగు వేల లీటర్ల పాలు
  • విజయ డెయిరీ మనుగడపై సందేహాలు

నిజామాబాద్, బతుకమ్మ:

రైతుల నుంచి సేకరించే పాలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. ఎందుకు తగ్గాయో అంచనా వేసుకొని, పెరిగేలా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్య ధోరణిని కనబరుస్తున్నారు. డెయిరీని అభివృద్దిలోకి తేవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతి సమావేశాలలో వల్లె వేస్తూ వస్తున్నారు. ఆయన ఎదుట హాజరవుతున్న అధికారులు, సంస్థ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని చెప్తూ, హమ్మయ్య ఇప్పటికయితే గండం గడిచిందని మొహం చాటేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వాధీనంలో నడుస్తున్న సంస్థ కావడంతో పని చేసిన, చేయకపోయిన జీతాలు మాత్రం ఆగడం లేదు. దీంతో డెయిరీ గురించిన ఆలోచనలు మరచి, తమ స్వలాభాపేక్షలో మునిగిపోతున్నారు.

  • రోజురోజుకి తగ్గుముఖం …

రెండు నెలల్లోనే రెండు వేల లీటర్ల మేరకు పాలు తగ్గడం చూస్తే విజయ డెయిరీ మనుగడ కొనసాగుతుందా అనే సందేహాలు పాడి రైతులకు పుట్టుకొస్తున్నాయి.
గతంలో సుమారు 30 వేల లీటర్ల వరకు పాలు సేకరించి, హైదరాబాద్ కు పంపించేవారు. ప్రస్తుతం పక్క జిల్లాల వైపు దేహి అని చేతులు చాపే స్థితికి డెయిరీ అధికారులు తీసుకురావడం సిగ్గుమాలిన చర్యగా రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు అందుతున్నప్పటికి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంలో శాశ్వత ఉద్యోగులు ఆరితేరిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • రైతులను కలిసేందుకు బిడియం..

పాడి రైతుల నుంచి వచ్చే పాలు గణనీయంగా తగ్గిపోతున్న దృష్ట్యా, వారిని క్షేత్ర స్థాయిలో కలిసి డెయిరీకి పంపించేలా ఒప్పించాల్సి ఉంటుంది. బాగా నడిచే కేంద్రాలను తొలగించే విధంగా ఒత్తిడి పెంచిన అదికారులకు, రైతులను కలిసేందుకు బిడియం కప్పేస్తుంది. అలాంటప్పుడు గ్రామాలలోకి వెళ్లి పాడి రైతులతో మాట్లాడేంత తెగువ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొద్దో, గొప్పో నడుస్తున్న బిఎంసి కేంద్రానికి వెళ్లి రావడంతోనే సరిపోతుంది… మిగతా సమయమంతా తాత్కాలిక, డార్క్ వర్కర్లపై పెత్తనం చెలాయించేందుకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

  • చైర్మెన్ రాకలో …

విజయ డెయిరీని దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ఉన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సంస్థ చైర్మెన్ అమిత్ రెడ్డిని సారంగాపూర్ లోగల మిల్క్ షెడ్ కు తీసుకొచ్చారు. ఆయన రాకలో ఆరు వేల లీటర్ల పాలు సేకరణ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతులను కలవడమే గాకుండా, సేకరణ పెంచి డెయిరీ అభ్యున్నతికి పాటుపడాలని చైర్మెన్ తోపాటు, బోధన్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కొద్ది నెలల్లోనే ఉన్నవాటికంటే మరింత తగ్గేల చేసిన ఘనత జిల్లా డెయిరీ అధికారులకు చెందుతుందనే విమర్శలు రైతుల నుంచే వస్తున్నాయి. వేసవి కాలంలో పాలు తగ్గుతాయని, ఆ మాత్రం తెలియదా అని అపర చాణక్యునిలా ఒక అధికారి మాట్లాడుతుండడం విశేషం. ఇదే విషయం బోధన్ ఎమ్మెల్యే ఎదుట ప్రస్తావిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. ప్రైవేటు కంపెనీలు అందులోనూ బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలలో వేల లీటర్ల పాలను… ఎలా సేకరిస్తున్నారో పాలు తగ్గాయని చెప్తున్నా అధికారికే తెలిసి ఉండాలి. చేతగాని ప్రభుత్వ ఉద్యోగికి మాటలెక్కువ..చాలీచాలని జీతమున్న ప్రైవేట్ ఉద్యోగికి చేతలెక్కువ అని డెయిరీలోని శాశ్వత ఉద్యోగిని ఉదహారిస్తూ సిబ్బంది విమర్శించడం విడ్డూరం.