నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ సురేష్ కుమార్, ఆరో టౌన్ ఎస్ఐ వెంకటరావు ఆధ్వర్యంలో అర్సపల్లి బైపాస్ రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకులో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అప్పటికే నిందితుడు ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి నిజామాబాద్ లో కొంత మంది యువకులకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మాయ మాటలు చెప్పి వారితో ఆన్ లైన్ లో డబ్బులు వసూలు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాడినని ఆసిఫ్ ఆలీ ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ సురేష్ కుమార్ తెలిపారు.