Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:40 pm Posted by : ramakrishna

మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి

 

. . . జీజీహెచ్ అభివృద్ధి సలహా సంఘ సమావేశంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్యులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన బుధవారం మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జీజీహెచ్ లో ఆయా విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంకనూ అవసరమైన వసతులు, వైద్య పరికరాల గురించి సంబంధిత విభాగాల వైద్యాధిపతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది ప్రజలకు అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. ఆసుపత్రులకు అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైద్య సేవలలో లోపాలకు తావులేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. నిజామాబాద్ జీజీహెచ్ ఆసుపత్రికి ప్రతి రోజు సగటున సుమారు 1700 నుండి 2000 వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రోగులకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, ముఖ్యంగా కార్డియాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ వంటి కీలక విభాగాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆయా విభాగాలకు అవసరమైన వెంటిలేటర్లు, ఆధునిక పరికరాలు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, ఆసుపత్రిలో తగిన మరమ్మతులు, అభివృద్ధి పనులు సకాలంలో చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న టీజీఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తోందని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

 

Better medical services must be provided.

 

ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డిలు మాట్లాడుతూ, అపారమైన అనుభవం కలిగిన వైద్యులు జిల్లాలో ఉన్నందున వారి సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించాలని కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మత్తు పదార్థాల నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ పనిచేస్తోందని, డీ-అడిక్షన్ సేవలను మరింతగా విస్తరించాలని అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను సమర్ధవంతంగా వినియోగిస్తూ, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఆసుపత్రి పనితీరు, నిర్వహణ మరింత మెరుగుపడేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని అన్నారు. పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్థీషియా, ట్రామా కేర్, డెర్మటాలజీ, మానసిక వైద్య విభాగం, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, జిల్లా క్యాన్సర్ సెంటర్, డీ-అడిక్షన్ సెంటర్ తదితర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను క్రమం తప్పకుండా సమీక్షిస్తామని తెలిపారు. ఆయా విభాగాలలో అందుబాటులో ఉన్న పరికరాలు, అవసరమైన వెంటిలేటర్లు, మౌలిక సదుపాయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికలను సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడాలని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, ఐ.ఐ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ చైర్ పర్సన్ డా.కవితా రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ మోహన్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంబంధిత శాఖల వైద్య అధికారులు పాల్గొన్నారు.

 

Better medical services must be provided.