లింగంపేట్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేటలో లబ్ధిదారు ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి కలెక్టర్ శుక్రవారం ముగ్గుపోసి మార్క్ అవుట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందని.. కానీ రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్మాణ దశల వారీగా పనులను బట్టి మొత్తం రూ.5లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి విజయ్ పాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎంపీడీవో నరేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షకాలం ప్రారంభానికి ముందే మురికిం కాలువల లోని చెత్తను తొలగించాలని, వర్షం నీటికి అడ్డుగా ఉండకుండా సరిచేయాలని తెలిపారు.
ప్రతీ శుక్రవారం డ్రై డే ఫ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళీ, ఎంపీడీఓ నరేష్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.