Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:33 pm Posted by : ramakrishna

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ :  అర్హులైన గిరిజన పోడు పట్టాదారులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ద్వారా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన గిరి జల వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం జరిగింది.  ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని 15 మండలాలలో పోడు భూములలో పంటలు సాగు చేసుకుంటున్న 5009 మందికి 10,172 ఎకరాలకు సంబంధించి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ కింద పట్టాలు అందించడం జరిగిందన్నారు. పంపిణీ చేసిన పోడు భూములలో సాగు నీటి వసతి కల్పన కోసం సౌర గిరి జల వికాసం పథకం కింద దశల వారీగా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తొలి దశ లబ్దిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర గిరి జల వికాసం పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Beneficiaries should be identified under the Indira Saura Giri Jal Vikasam Scheme.