Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:11 pm Posted by : ramakrishna

మీర్జాపూర్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు

 

. . . ఇళ్లలో కిరాణా దుకాణల్లో మద్యం అమ్మకాలు

 

. . . అధిక ధరలు…అక్రమ బెల్టుషాపులు

 

. . . అధికారులకు నెలవారీ మామూళ్లు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడో, కొన్ని సందర్భాల్లో నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు తర్వాత వారికి సహకరించినంత పని చేస్తున్నారు.

. . . ప్రోత్సహిస్తున్న వైన్స్ నిర్వాహకులు

కామారెడ్డి జిల్లా నసుర్లబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలో బస్టాండ్ ప్రాంగణ సమీపం వద్ద రెండు, మూడు చోట్ల బెల్టు షాపుల దందా జోరుగా కొనసాగుతోంది.కిరాణా కొట్టులో, హోటల్ లో, ఇండ్లల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.ఈ బెల్టు షాపుల నిర్వాహకులు వైన్స్ నుండి ద్విచక్ర వాహనాలపై మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల్లో మద్యం అధిక ధరలకు విక్రాయిస్తున్నా కూడా బెల్ట్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీరికి వైన్సు నిర్వహకులు కొండంత అండగా ఉంటున్నారు. మీ దగ్గరికి ఎవరూ రారు.. మేము చూసుకుంటాం అని భరోసానిస్తున్నారు. అందుకుగానూ ఒక్కో బీరుపై రూ.10, మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి 30 వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వహకులు వినియోగదారుల నుంచి ఒక్కో సీసాపై రూ.30-50 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువేత్తుతున్నాయి.

. . . ఇళ్లలోనే బెల్టు షాపులు

ఒకప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి రెండు, మూడు భయంభయంగా నిర్వహించేవారు. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అయితే బెల్ట్ షాపులంటే మద్యం దుకాణాల్లా కనిపించవు. ఏకంగా ఇళ్లలోనే చాలావరకు మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏ రాత్రి వెళ్లినా వీరి వద్ద మద్యం లభిస్తుంది. అడపాదడపా దాడులు చేసే ఆబ్కారీ శాఖ, పోలీసులు మళ్లీ ఇటు వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్టు షాపులపై చర్యలు తీసుకుంటారా?.. లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.