Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:24 pm Posted by : ramakrishna

బిచ్కుంద సెంటర్ బస్టాండ్‌లో బెల్ట్ షాపు దందా

 

. . . ఎవరేం రాసుకున్నా మనకేం కాదంటూ బెల్ట్ షాప్ యజమాని బహిరంగ వ్యాఖ్యలు

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

బిచ్కుంద మండల కేంద్రంలోని సెంటర్ బస్టాండ్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని పత్రికా కథనాల ద్వారా బయటపెట్టి వార్తలు రాసినప్పటికీ, బెల్ట్ షాపు యజమాని మాత్రం బెదరకుండా వ్యవహరిస్తున్నాడు. “ఎవరేం రాసుకుంటే మనకేం ఇబ్బంది లేదు. అంతా వైన్స్ షాపు యజమాని చూసుకుంటాడు” అని ఆ యజమాని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా మద్యం విక్రయించడం నేరం. బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతంలో బహిరంగంగా మద్యం అమ్మడం వల్ల ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

. . . వైన్స్ షాపు యజమాని ప్రమేయం ?

“వైన్స్ షాపు యజమాని చూసుకుంటాడు” అన్న వ్యాఖ్యల వెనుక ఏ ఫోర్ లైసెన్స్ కలిగిన వైన్స్ షాపుల నుండి బెల్ట్ షాపులకు అక్రమంగా హోల్ సెల్ గా మద్యం సరఫరా అవుతోంది అంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమని తేలితే బెల్ట్ షాపు యజమానితో పాటు సంబంధిత వైన్స్ షాపుపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

. . . అధికారుల చర్యలపై విమర్శలు

ఈ విషయం బహిర్గతమై వార్తలు వచ్చినా ఇంతవరకు ఎక్సైజ్ శాఖ, పోలీసు అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులు స్పందించి బస్టాండ్ ప్రాంతంలోని బెల్ట్ షాపుపై దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.