
. ఎన్నికలు నిర్వహించకపోవడంపై రెవెన్యూ ఉద్యోగుల్లో అసహనం
. ప్రత్యామ్నాయంగా మరో సంఘంలోకి వెళ్లే ఆలోచన
. 2017 నుంచి ఒకే కార్యవర్గం ఏకాచత్రాధిపత్యం
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా) ఏకఛత్రాధిపత్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. 2017 నుంచి నాయకులు తాము ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ పనులు కానిస్తున్నారనే ఆరోపణలు సర్వత్యా వ్యక్తమవుతున్నాయి. ఆ నాయకుల తీరుతో విసిగివేసారిన రెవెన్యూ ఉద్యోగులు పండగలోపు ఎన్నికలు నిర్వహించకుంటే తమ దారి తాము చూసుకుంటామని బహిరంగంగానే అల్టిమేటం జారీ చేశారు.
నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ (ట్రెసా)కు 2017 నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రెవెన్యూ ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాడు ఎన్నికైన కార్యవర్గ సభ్యులే సంఘాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఏకచత్రాధిపత్యం వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత యూనియన్ కార్యవర్గం సహచర ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నారా అంటే అదీ లేదని, అలాంటప్పుడు ఏళ్ల తరబడి కొనసాగడానికి వీళ్ళేదనే సంకేతాలను ఇస్తున్నారు. జిల్లాలో రెవెన్యూ సంఘం ఎన్నికలను పండగ లోగా నిర్వహించకపోతే మరో సంఘం లో చేరుతామంటున్నారు. ఈ పరిస్థితి వస్తే బలమైన సంఘంగా పేరున్న ట్రెసాకు కోటకు బీటలు వారే అవకాశాలున్నాయి. ఇన్నాళ్లు ట్రెసా మీద ఆగ్రహంతో ఉన్నవారితోపాటు నూతన అసోసియేషన్ లో చేరేందుకు ఆసక్తితో ఉన్న ఉద్యోగులు త్వరలో ఆవిర్భవించే సంఘంలో సభ్యత్వం తీసుకుంటే పాత సంఘం ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
అసోసియేషన్ ను అడ్డుపెట్టుకొని..
ప్రస్తుతం ట్రెసా నాయకులుగా చలామణి అవుతున్న వారు సంఘాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు ఆరోపణలున్నాయి. అసోసియేషన్ ను అడ్డుపెట్టుకొని జిల్లా కేంద్రాన్ని దాటకుండా ఇక్కడే తిష్టి వేశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వేరే జిల్లాల్లో అసోసియేషన్ నాయకులకు బదిలీ అయితే మారుమాట మాట్లాడకుండా వెళ్లిపోతుండగా, ఇక్కడి నాయకులు మాత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని వీడడం లేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన అసోసియేషన్ నాయకులు తమకు, తమ వారికి బదిలీలు కాకుండా, తమ జోలికి ఎవరూ రాకుండా అసోసియేషన్ పేరును వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత నాయకత్వంతో తమకేమీ ఒరిగింది లేదని ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అంటున్నారు. రానున్న పండగలోగా ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలంటే అయిష్టత
నిబంధనల ప్రకారం రెండేళ్లకోసారి అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రెవెన్యూ సంఘంలో 2017 నుంచి నూతన కార్యవర్గం ఎన్నిక అనేది లేకుండా ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం నడుస్తోంది. నాయకులు వారి స్వలాభం కోసం, వ్యాపారాలకు యూనియన్ ను వాడుకుంటున్నారే గానీ సహచర ఉద్యోగుల వెతలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలు నిర్వహిస్తే తమ ఆటలు సాగవని భావిస్తున్న ప్రస్తుత కార్యవర్గ సభ్యులు ఎన్నికలకు వెళ్లేందుకు అయిష్టంగా ఉన్నారని రెవెన్యూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికలు నిర్వహించి ట్రెసాను కాపాడుకోకపోతే మరో సంఘం బలపడే అవకాశాలు ఉన్నాయి. ట్రెసా పరంగా న్యాయానికి నోచుకోలేని ఉద్యోగులు నూతనంగా సంఘంలో చేరేందుకు కుతూహలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో సంఘం ఏర్పాటైతే కార్యవర్గాన్ని భుజస్కంధాలపై మోసేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళా ఉద్యోగులు పేర్కొనడం చూస్తే ట్రెసా పరంగా ఎన్ని వెతలు పడ్డారో అర్థమవుతోంది.
టీజీఆర్ఈఎస్ఏ పేరుతో నూతన సంఘం..
గత ప్రభుత్వ హయాంలో ట్రెసా నాయకులు సహచర ఉద్యోగులను విస్మరించి వారి పనులను చక్కబెట్టుకున్నారు. వారి అనుయాయులకు కొన్ని పనులు చేయించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉద్యోగుల బాధలను పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. సమస్యను చెప్పుకుందామంటే నాయకులు అందుబాటులో ఉండరు. ఎక్కడికెళ్లారని ఆరా తీస్తే.. హైదరాబాద్ లోని సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లారనే సమాధానం వస్తుంది. నాయకుల కోసం తిరిగి తిరిగి వేసారిన పలువురు ఉద్యోగులు అసోసియేషన్ ను పక్కన పెట్టి తమ సమస్య పరిష్కారం కోసం న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే యూనియన్ ఉండడంతో తమను దాటి వెళ్లలేరనే అహం ప్రస్తుతం కార్యవర్గంలో కొట్టొచ్చినట్లు కనబడుతోందనే విమర్శలున్నాయి. త్వరలోనే ట్రెసా (టీఆర్ఈఎస్ఏ) కు దీటుగా టీజీఆర్ఈఎస్ఏ పేరుతో నూతన సంఘం ఆవిర్భవించనున్నది. ఈ సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా నడవనుందనే ఊహగానాలు వినబడుతున్నాయి.