Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2026, 1:22 pm Posted by : ramakrishna

జనభేరి గోడ ప్రతులను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణన ప్రశావళిలో ఓబీసీ కాలం చేర్చాలని చేపట్టే బీసీల జనభేరీ కార్యక్రమ గోడప్రతులను శనివారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న “బీసీల జనభేరి” కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి బీసీ బిడ్డలందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. వంద సంవత్సరాల కిందట ఎప్పుడో బ్రిటిషర్సు జరిపిన బీసీ కుల గణన తప్పితే అప్పటినుండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా బీసీల కులగణన చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. 2025 ఏప్రిల్ 1న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ లో బీసీ కులగణన చేయాలని నిర్ణయం తీసుకొని కూడా ఇప్పుడు జరుగుతున్న జాతీయ కుల గణనలో ఓబీసీల కాలం లేకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ మాటను నిలబెట్టుకొని జాతీయ కుల గణనలో ఓబీసీ కాలమును చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తో పాటు దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, బగ్గలి అజయ్, శ్రీలత, నరేష్, గంగాధర్, శ్రీనివా,స్ సత్యనారాయణ, సురేందర్ మురళి అనిల్ గోపి అంకంరావు తదితరులు పాల్గొన్నారు.