మేదరి కులస్థుల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పరిశీలన
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం సోమవారం రాత్రి నిజామాబాద్ నగరంలోని బురుడుగల్లీ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానికంగా దశాబ్దాల కాలం నుండి నివాసాలు ఉంటున్న మేదరి కులస్తుల జీవన స్థితిగతులను క్షేత్రస్థాయి సందర్శన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు మేదరి కులస్తులకు చెందిన ఒక్కో ఇంటిని సందర్శిస్తూ, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వెదురుతో తయారు చేసిన ఉత్పత్తులు పరిశీలించారు. మేదరి వృత్తిపై ఆధారపడిన తాము దుర్భర జీవనాలు వెళ్లదీస్తున్నామని, తమను ఇతర రాష్ట్రాల తరహాలో ఎస్.టీ జాబితాలో చేర్చాలని, జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టేలా సిఫార్సు చేయాలని మేదరి కులస్తులు, ఆ సంఘం నాయకులు కోరారు. వారి అభ్యర్థనలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సానుకూలంగా స్పందించారు. తాము పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించి, ప్రత్యేక తోడ్పాటు అందించాల్సిందిగా సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్ బృందం వెంట జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి స్రవంతి, తహసీల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు.
