Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 6:29 pm Posted by : ramakrishna

కేజీబీవీ, యుఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగ ఉపాధ్యాయులకు బేసిక్ పే చెల్లించాలి

 

. . . ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యుఆర్ఎస్), సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా వివిధ సమస్యలతో బాధపడుతున్నారని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్, జిల్లా అధ్యక్షులు ఓ.రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

 

Basic pay should be paid to teachers employed by KGBV, URS, and SSA

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు పేర్కొన్నారు. గతంలో 29 రోజులపాటు సమ్మె నిర్వహించిన సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మూడు దశల ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం రెండవ దశగా జిల్లా కేంద్రాలలో నిరసనలు తెలుపుతూ మెమోరాండం సమర్పించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కేజీబీవీ, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకారం వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగులకు సెలవులు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. అలాగే హాస్టల్ నిర్వహణకు తగిన సిబ్బందిని నియమించాలని, గత సమ్మె సమయంలో నిలిపిన వేతనాలను విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కేజీబీవీ, యుఆర్ఎస్ పాఠశాలల్లో అవసరమైన సిబ్బందిని, సదుపాయాలను కల్పించాలని వారు కోరారు. ఈ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని, సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20న ఛలో అసెంబ్లీ కార్యక్రమంతో పాటు, భవిష్యత్తులో మరింత తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, కోశాధికారి రాజారామ్, జిల్లా కార్యదర్శి సాయన్న, ఆనంద్, ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు విజయ్, టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు గంగాధర్, కపిల్ దేవ్, శ్రీనివాస్, బాబులు, శంకర్, కేజీబీవీ ఉపాధ్యాయులు, సీఆర్ పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ లు, ఎస్ఎస్ఏ జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.