. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయటంతో పాటు పాఠశాలల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కొరకు ప్రభుత్వం నిధులను కేటాయించి పర్యవేక్షణ పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని శంకర్ భవన్ పాఠశాలను సందర్శించి పాఠశాల సిబ్బందితో ప్రధానోపాధ్యాయులతో, విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకుని వారితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శంకర్ భవన్ స్కూల్లో కోతుల బెడద విపరీతంగా ఉందని పాఠశాల ఆవరణలోనే పిల్లలతో పాటుగా కోతులు కూడా సంచరించటం మూలంగా బడి పిల్లలు భయంతో పాఠశాలకు వచ్చే పరిస్థితులు ఉన్నాయని, వాటిని రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

500 మంది పిల్లలకు పైగా పాఠశాలలో చదువుతున్నప్పటికీ వారికి కావలసిన బాత్రూంలు లేకపోవడంతో ఉన్నవాటిని శుభ్రంగా ఉంచటంలో నిర్లక్ష్యం వహించడం వలన పిల్లలు బయటకు వెళ్లాల్సి వస్తుందని ఆయనన్నారు. స్వీపర్లకు సకాలంలో సరిపడా సరైన వేతనాలు ఇవ్వకపోవడం వలన తరగతి గదులన్నీ శుభ్రంగా ఉంచటం లో నిర్లక్ష్యం కనబరుస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కరెంట్ సౌకర్యం అన్ని తరగతి గదుల్లో కల్పించి ఫ్యాన్ లను ఏర్పాటు చేయాలని సీబీఎస్సీ కోర్సులను ప్రారంభించాలని అందుకొరకు ఇంటర్ నెట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీటితో పాటు సరిపడా ఉపాధ్యాయులను సరైన తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆయనన్నారు. ప్రభుత్వం పేద మధ్యతరగతి పిల్లలకు చదువు అందించటానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అందుకు మరిన్ని నిధులను పెంచాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల కుదింపు ఆలోచనను మానుకొని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను పెంచి వసతులను కల్పించాలని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ప్రజలకు అందుబాటులో పాఠశాలలో ఉంటేనే విశ్వాసం నమ్మకం పెరుగుతుందని, తనిఖీలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు నల్వాల నరసయ్య నగర నాయకులు శంషాద్దీన్, అంజయ్య, సతీష్ ,అబ్దుల్, విద్యార్థి సంఘ నాయకులు దీపిక, విగ్నేష్, వినీత్, రాజు, గోవిందు, తదితరులు పాల్గొన్నారు.
