నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ శాఖ ముందు స్టేట్ బ్యాంకు ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రంగ బ్యాంకులను బలోపేతం చేయడమే దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. నూతన పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్) ఉద్యోగుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రోజురోజుకూ పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. మెసెంజర్ రిక్రూట్మెంట్, ఆర్మ్డ్ గార్డ్ రిక్రూట్మెంట్‌తో పాటు ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై అధిక పనిభారం మోపుతున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, ఆరోగ్య భద్రతా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు తగిన వేతనాలు, పదవీ విరమణ అనంతర భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించే విధానాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ, పీఎఫ్‌ఆర్‌డీఏను కోరారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ రమేష్, గురునాథ్, శ్రీనివాస్, సునంద, ప్రమోద్, సుధాకర్, సుప్రీం, అర్చన బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.