- అడిషనల్ కలెక్టర్ తో పాటు విద్యాఖాధికారులకు ఫిర్యాదు
- చర్యలకు సిఫారసు చేసిన అధికారులు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ శశికళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా యువజన సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి రమావత్ చరణ్ బతుకమ్మ సంబరాల రోజు సెల్ ఫోన్ తీసుకువచ్చాడని హెడ్ మాస్టర్ శశికళ టీసీ ఇచ్చి పంపించేసిందని ఆరోపించారు. సెల్ ఫోన్ ద్వారా ఎలాంటి అడ్డంకులు చేయకపోయినా విద్యార్థి జీవితం నాశనం చేయాలని హెడ్ మాస్టర్ కంకణం కట్టుకుందని ఆరోపించారు. శశికళ తన కొడుకును స్కూల్ కు రానివ్వడం లేదని తెలిసి క్షమాపణ చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తించారని అవమానించి పోలీసులకు పట్టించిందని అన్నారు. ఈ విషయమై బంజారా యువజన నాయకులు శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు, అదే విధంగా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగజ్యోతికి లిఖితపూర్వకంగా హెచ్ ఎంపై ఫిర్యాదు చేశారు. 8వ తరగతి విద్యార్థిపై కక్ష్యసాధింపు చర్యలు చేపట్టి విద్యార్థిని చదువకుండా చేసినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయంపై అదనపు కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను సిఫారసు చేశారు.
