- కాంగ్రెస్ – బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లు
- ఛలో వేల్పూర్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ కార్యకర్త
- భారీగా బీఆర్ఎస్ శ్రేణుల మోహరింపు
- ఇరు వర్గాల బాహాబాహీ.. చెదరగొట్టిన పోలీసులు
- బాల్కొండ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఇంచార్జీల గృహ నిర్బంధం
- వేల్పూర్ లో రోజంతా హైడ్రామా
- కొనసాగిన 163 సెక్షన్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ -బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్ల పొలిటికల్ హీట్ పెరిగింది. రోజంతా హైడ్రామా నడిచింది. పోలీసుల 163 సెక్షన్ విధించిన ఓ కార్యకర్త మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి దాడికి యత్నించగా అడ్డుకుని పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే ప్రశాంత్ర్ రెడ్డి విమర్శలతో కాంగ్రెస్ కనువిప్పు పేరిట చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలు, అరెస్టులకు దారితీసింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట గురువారం ఛలో వేల్పూర్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అధికార కాంగ్రెస్ సవాల్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ సై అంటే సై అంటూ కత్తులు దూసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా కాక రేగింది. కాంగ్రెస్ తలపెట్టిన ఛలో వేల్పూర్ కు అనుమతి లేదంటూ పోలీసులు బుదవారం రాత్రే నిషేధాజ్ఞలు విధిచారు. వేల్పూర్ లో 24 గంటల పాటు 163 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతలు వేల్పూర్ వెళ్లకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జీ సునీల్ రెడ్డిలను గృహనిర్బంధం చేశారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని సైతం గృహ నిర్బంధం చేశారు.

కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలొచ్చే అవకాశం ఉందనే సమాచారంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటికి ముఖ్య నేతలు తరలొచ్చారు. ప్రశాంత్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఇంట్లో ఉన్న కార్యకర్తలను బయటకు పంపారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఇంట్లో చొరబడగా.. అతన్ని బిఆర్ఎస్ నాయకులు చితకబాదారు. మరోసారి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతకు ముందు గృహ నిర్బంధం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన మోహన్ రెడ్డి, సునీల్ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని లేని పక్షంలో నియోజకవర్గంలో తిరగనివ్వమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు.

కాంగ్రెస్ తలపెట్టిన బీఆర్ఎస్ నేతలకు కనువిప్పు కార్యక్రమం.. ఉద్రిక్తతలకు దారితీసింది. వేల్పూర్ లో పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ -బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు పడకుండా కట్టుదిట్టంగా పహారా కాశారు. ఐతే కొందరు గాంధీ విగ్రహం వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. గల్ప్ కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రగడ మొదలైంది. గల్ప్ కార్మికులకు ప్రభుత్వం చేసిన సంక్షేమం పై చర్చ కు సిద్దమని డీసీసీ అధ్యక్షుడు ప్రకటించాడు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కార్యక్రమం చేపట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో పరిహారం అందిన గల్ప్ కార్మికులను తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. పథకాలు రాని వారిని తీసుకొస్తామని బీఆర్ఎస్ ప్రతిసవాల్ విసిరింది. ఈ సవాళ్లు కాస్తా ఉద్రిక్తతలు అరెస్టులకు దారితీసింది. కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమానికి ప్రతిగా బీఆర్ఎస్ కార్యక్రమానికి సిద్దపడగా.. ఇరు వర్గాలను ముందస్తు అరెస్టులు, ఇళ్ల వద్ద కట్టడి చేయడంతో.. ఉదయం నుంచి సాయంత్రం వరకు హై డ్రామా నడిచింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ – బీఆర్ఎస్ నేతల సవాళ్లు -ప్రతిసవాళ్లతో బాల్కొండ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎటువైపుకు దారితీస్తుందో.. వేచిచూడాలి. స్వల్ప వివాదాలు మినహా.. కాంగ్రెస్ కార్యక్రమం ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
