. . . నేటితో ప్రచారం సమాప్తి
. . . చివరి రోజు రోడ్ షోలకు ప్రాధాన్యత
. . . షురూ కానున్న తాయిలాల పంపిణీ
. . . అన్ని పార్టీ లలో గెలుపు పై ధీమా
నిజామాబాద్, బతుకమ్మ :
స్థానిక సంస్థల ఎన్నికలలో కీలకమైన బల్దియాపోరు తుది అంకానికి చేరుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, భీంగల్, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాల్టీ లలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ లుగా ఎన్నికయేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం తో ప్రచారం ముగియనుంది. ఈనెల 11 న ఎన్నికలు జరుగనుండగా ప్రలోబాలా పర్వం ప్రారంభం కానుంది. మున్సిపల్ లో పాలకులు గా ఎన్నికయ్యేందుకు రాజకీయ పార్టీల గుర్తుల పై పోటీ చేస్తుంటే మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను రాజకీయ పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ తో పాటు బిజెపి పార్టీ లు ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి. అందుకే రెండు పార్టీలు ఆయా మున్సిపాల్టీలలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని రంగంలోకి దించింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ మేయర్ స్థానం గెలుపు కోసం అర్బన్ లో తిష్ట వేశారు. బోధన్ ఎన్నికలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి లో షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బిచ్కుంద లొ లక్ష్మి కాంత్ రావు, ఆర్మూర్, భీంగల్ లొ నియోజకవర్గం ఇంచార్జి లు కార్పొరేషన్ ల చైర్మన్ లు బాధ్యత తీసుకున్నారు. బీజేపీ తరుపున నిజామాబాద్ ఎంపీ ఫైర్ బ్రాండ్ అర్వింద్ ధర్మపురి ఒక్కరూ తన భుజస్కంధాలపై మోస్తూ అర్బన్ లొ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ, ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి లు బాధ్యత తీసుకొని ప్రచారం చేసారు. కామారెడ్డి లో ఎమ్మెల్యే రమణా రెడ్డి ఒక్కరూ అని తానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమి తక్కువ కాదని జోరుగా ప్రచారం చేశారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్నర్ మీటింగ్ ల తో రోడ్ షోలతో సందడి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపల్ తో పాటు ఇతర మున్సిపాలిటీలలో ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీలలో ప్రచారం ను హోరెత్తించారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాదులో బహిరంగ సభ తో పాటు ఇతర ప్రాంతాలలో రోడ్ షోలను చేసి క్యాడర్లో జోష్ నింపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగియనుంది. ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తాయలాల పంపిణీ జోరందుకోనుంది. ఇప్పటివరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే మద్యం, పైసలు పంపిణీ జోరందుకోనుంది. మద్యం షాపులు మూత పడ నుండటంతో ముందుగానే డంపింగ్ లు చేసుకొని లిక్కర్ పంపిణి కి ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల హామీలతో పాటు ఓటుకు నోటు ఇస్తే గాని ఓటరు దేవుడు కరుణించడని లీడర్ లకు తెలియంది కాదు. ఈ నేపథ్యంలోని కొందరు అప్పులు చేసుకుంటే మరి కొందరు ఆస్తులు అమ్ముకొని బరిలో నిలిచారు. పై పైకి తామే గెలుస్తామని మేక పోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్న అంతరంగంలో భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి తైలాల పంపిణీ షురూ కానుంది.