- ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు లేవు
- శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడదతో ప్రజలు వేగలేకపోతున్నారు. చీకటి పడితే చాలు ముసురుతున్న దోమలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడదను తట్టుకునేందుకు ప్రజలు మస్కిటో కాయిల్స్, అగర్ బత్తులు వినియోగించాల్సి వస్తోంది. దోమల నివారణకు మున్సిపాలిటీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.సాధారణంగా సంధ్య సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచుతారు. కానీ బాన్సువాడ పట్టణంలో దోమల బెడద వల్ల తలుపులు మూసి ఉంచే పరిస్థితి నెలకొన్నది. రాత్రివేళ బయట కూర్చోవాలంటే దోమలతో ఇబ్బందిగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. చిరు వ్యాపారులు దోమల బెడదతో టేబుల్ ఫ్యాన్లు పెట్టుకొని మరి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.గత కొన్ని రోజులుగా దోమల సమస్య మరింత పెరిగిందని ప్రజలు చెబుతున్నారు.
- పారిశుద్ధ్యం అస్తవ్యస్తం…
బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులున్నాయి. పారిశుధ్య నిర్వహణ కోసం 50 మంది పైగా కార్మికులున్నారు. కానీ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించక డ్రైనేజీలు దోమలకు నిలయంగా మారాయి. మరో వైపు వ్యర్థాలు నిండిపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. ఈ పరిస్థితి దోమల వృద్ధికి అనుకూలంగా మారింది.డ్రైనేజీలు కంపు కొడుతుండగా, దోమల బెడద రోజురోజుకు పెరుగుతోంది…
- దోమల నివారణ చర్యలు శూన్యం…
బాన్సువాడ మున్సిపాలిటీలో దోమల నివారణ చర్యలు కానరావడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ యంత్రాలున్నా వినియోగించడం లేదని విమర్శలు ఉన్నాయి. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో దోమల బెడద పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దోమల నివారణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు…
- ఖాళీ స్థలాల్లోనే చెత్తాచెదారం…
మున్సిపల్ అధికారులు ప్రతి రోజు ఇంటింటికి చెత్త సేకరణ చేపడుతున్నా పట్టణ ప్రజలు చెత్తా చెదారం, వ్యర్థాలను ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. చెత్తా చెదారం పేరుకు పోవడం చెట్లు పెరిగి భయంకరంగా కనిపిస్తున్నాయి. ఖాళీ స్థలాల్లో నీరు, చెత్తా చెదారం నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. మరోపక్క దుర్గంధం వెదజల్లుతుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఖాళీ స్థలాల పై సర్వే చేసి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.