బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి.
బాన్సువాడ, బతుకమ్మ :
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బాన్సువాడలో బక్రీద్ పండుగ ను సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి పిలుపునిచ్చారు.బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం, హిందూ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండుగ ను పరస్పర మతాలు గౌరవిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ తుల శ్రీధర్,వివిధ పార్టీల నాయకులు అంజిరెడ్డి, కాసుల రోహిత్, వహబ్, సాహెబ్, అసద్ బిన్ మోసిన్, అఫ్రోజ్, లింగం, హకీమ్ ముస్లిం మత పెద్దలు, యువకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…
