వెబ్ న్యూస్, బతుకమ్మ : చార్‌ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు ధామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి బద్రినాథ్ చేరుకొని స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. జై బద్రీ విశాల్ నినాదాలతో బద్రీనాథ్ ప్రతిధ్వనించింది. దాదాపు 40 క్వింటాళ్ల బంతిపువ్వులతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఛార్‌దామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. అంతకు ముందు అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి.