Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 12:27 pm Posted by : ramakrishna

రూ. రెండున్నర లక్షలకు పసికందు విక్రయం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కన్నతల్లి మరో ముగ్గురితో కలిసి తన రెండు నెలల కొడుకును విక్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని తల్లి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. పోలీసులు పసికందును విక్రయించిన తల్లితోపాటు కొనుగోలు చేసిన వ్యక్తిని, ఇద్దరు దళారులను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపుతుంది. నగరంలోని ఎల్లమ్మ కుంటకు చెందిన బూరాల శ్రీనివాస్ లక్ష్మీ దంపతులు. లక్ష్మికి ఇదివరకే వివాహం జరగగా మొదటి భర్త ద్వారా ఒక కూతురు ఉంది. పెయింటర్ పనిచేసే శ్రీనివాస్ లక్ష్మీలు కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకోగా వారికి రెండు నెలల కొడుకు ఉన్నాడు. ఇటీవల కాలంలో ఇద్దరు మధ్య విభేదాలు తలెత్తి గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 4న లక్ష్మి తన రెండు నెలల కొడుకుతో బయటకు వెళ్లి 5న ఒక్కతే ఇంటికి తిరిగి వచ్చింది. తన కొడుకు ఎక్కడ అని శ్రీనివాస్ భార్యని అడగగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈనెల 5న నాలుగో టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లక్ష్మి తిరిగిన ప్రాంతంలో ఆమె సెల్ ఫొన్ ద్వారా ఉన్న డాటా తో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి… లక్ష్మి కి మ్యాట్రిమోనీ లో పనిచేసే నిజామాబాద్ చెందిన రమాదేవి మంజులకు పరిచయస్తులు. వారిద్దరికీ హైదరాబాద్ చెందిన విఠల్ అనే వ్యక్తి తాను  పిల్లలేని వారికి కొడుకు(పసికందు) ను విక్రయిస్తా అని ప్రతిపాదన చేశారు. రూ. రెండున్నర లక్షలకు మహారాష్ట్రలోని పూణేకు చెందిన విశాల్ అనే వ్యక్తికి పసికందును అమ్మి వేశారు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి లక్ష్మి తో పాటు మధ్యవర్తిత్వం వహించిన రమాదేవి, మంజుల పసికందును కొనుగోలు చేసిన విశాల్ ను అరెస్టు చేశారు విఠల్ పరారీలో ఉన్నాడని ఎస్ హెచ్  వో తెలిపారు..