Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 April 2025, 5:25 pm Posted by : ramakrishna

ఘనంగా బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

నిజామాబాద్, బతుకమ్మ : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు.  ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని భావితరాలకు తెలియజేస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఫూలే వంటి మహనీయుల కృషి ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, నేడు మనమంతా గౌరవప్రదమైన స్థితిలో జీవనాలు వెళ్లదీస్తున్నామని కలెక్టర్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించారని, తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు.

Babu Jagjivan Ram Jayanti celebrated with great pomp

మహనీయుల గురించి తెలుసుకొని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు 5800 యూనిట్లు కేటాయించారని అన్నారు. అర్హులైన ఎస్సీ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని దళిత సంఘాల ప్రతినిధులకు సూచించారు. తద్వారా వారు స్వయం ఉపాధి పొందడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కల్పించవచ్చని అన్నారు. జిల్లాలో వివిధ కుల సంఘాల వారు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంకిత భావంతో కృషి చేస్తుందని భరోసా కల్పించారు. ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తేవాలని సూచించారు. దళిత సంఘాలు ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తున్న పాత అంబేడ్కర్ భవనం మరమ్మతులకు వారం రోజుల్లోనే రూ. 5 లక్షల నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఈ భవనాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆధునీకరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Babu Jagjivan Ram Jayanti celebrated with great pomp

ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేశ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు మాట్లాడుతూ, దేశానికి ఎన్నో  విధాలుగా సేవలందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సాధారణ కుటుంబంలో జన్మించిన బాబు జగ్జీవన్ రాం బడుగు, బలహీన వర్గాలు రాజ్యాంగ ఫలాలు అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయనించాలనే సంకల్పంతో అహరహం శ్రమించారని అన్నారు. జగ్జీవన్ రాం ఏ ఒక్క కులానికో, వర్గానికో చెందిన వ్యక్తి కాదని, సమాజంలో సమానత్వం కోసం పరితపించిన మహనీయుడని కొనియాడారు.

Babu Jagjivan Ram Jayanti celebrated with great pomp

జయంతి కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Babu Jagjivan Ram Jayanti celebrated with great pomp