Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 7:36 pm Posted by : ramakrishna

నిజామాబాద్ డీసీసీ రేసులో అయ్యప్ప శ్రీను

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అయ్యప్ప శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లాలో ఇంచార్జిలను నియమించింది. ఈ నెల 12 వరకు ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నవిషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలో డీసీసీ పదవిని రెడ్డిలకు లేదా మున్నూరు కాపులకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా అసెంబ్లీ స్థానాన్ని కేటాయించలేదు. ఇటీవల కాలంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేస్తామని ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన చేసిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీలకే అని ప్రచారం జోరందుకుంది.  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన అయ్యప్ప శ్రీను బీసీ కోటాలో డీసీసీ పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 20 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ లో చేరి ఆర్మూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి పూర్వ వైభవానికి కారణమయ్యారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది ఆర్మూర్ బల్ధియాలోనే. అయ్యప్ప శ్రీను సతీమణి వన్నెల్ దేవి లావణ్య కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ చైర్ పర్సన్ గా పని చేశారు. ఆర్మూర్ బల్ధియాలో అప్పటి వరకు ఒక్కరే కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండగా అయ్యప్ప శ్రీనివాస్ 20 మంది కౌన్సిలర్లతో పీసీసీ చీఫ్, అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో , మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రోద్భలంతో కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారడానికి నియోజకవర్గంలో కాంగ్రెస్ పుంజుకోవడానికి అయ్యప్ప శ్రీను కారణమని చెప్పాలి.  ఆర్మూర్ నియోజకవర్గంలో అయ్యప్ప శ్రీనివాస్ అంటే తెలియని వారు లేరు. ఆయన ధార్మిక, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు సుపరిచితుడే. ఆర్మూర్ పట్టణంపై పట్టున్న నేతగా సుప్రసిద్దుడు. నగరంలోని సిద్దులగుట్టపైన అయ్యప్ప మందిరాన్ని సొంత నిధులతో నిర్మించి తన సేవా నీరతిని చాటుకున్నారు. ప్రతి యేడాది 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములకు అన్నదాన నిర్వహణ చేస్తూ అందరి తలలో నాలుకగా మెదులుతున్నారు. గడిచిన బల్ధియా పాలకవర్గంలో డెవలప్ మెంట్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇస్తే పార్టీ బలోపేతంతో పాటు బీసీలకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీసీ కార్డు ద్వారా డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నవారిలో అయ్యప్ప శ్రీనుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాలి. త్వరలో దరఖాస్తులు చేసి అధిష్టానం ఆశీస్సులు కోరుతానని అయ్యప్ప శ్రీనివాస్ చెబుతున్నారు.