హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, విద్యార్థులకు జాగృతి భరోసా నిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ -1 నియామకాల్లో అవకతవకలపై గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రూప్-1 విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నామన్నారు. 15వ తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ -1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టటంలో మీడియా, సోషల్ మీడియా చాలా సహకరిస్తోందన్నారు. వారి ఒత్తిడి కారణంగానైనా ప్రభుత్వం కొంచెమైనా బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఇప్పడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు రద్దు చేసి…మళ్లీ రీ ఎగ్జామ్ పెడుతుందని భావిస్తున్నామన్నారు. శుక్రవారం ఆశోక్ నగర్ లో వంట వార్పు నిర్వహించనున్నామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం చేసిన తీర్మానాన్ని గవర్నర్ కు, సీఎంకు పంపిద్దామన్నారు.
